Saturday, March 28, 2009

సరిహద్దురేఖ






ఈ రేఖపైన
రెండు దేశాల
ఆంక్షల్ని జయించుదాం

ఇరు హౄదయాల లయను
ఒకటి చేసే శ్వాసను
సృష్టిద్దాం

రక్త జలపాతాల మధ్య
విద్వేషాగ్ని లావా ప్రవాహాల గుండా
ఓ శాంతి మార్గాన్ని నిర్మిద్దాం

దారి పొడవునా
పంచుకోవలసిన రక్తస్పర్శల్ని
పోగొట్టుకున్న ఆత్మీయతల జాతరలని
అలంకరిద్దాం
చిరునవ్వుల హరివిల్లు ముక్కలతో

పాటకి, మాటకి మధ్య
రాగం తప్పినా
తాళం తప్పినా
నియమ భంగమే కదా

ఎందుకొచ్చిన గొడవ
కళ్ళతో హృదయాలని
ఆవిష్కరించుకొనే
కొత్త భాషకి
శ్రీకారం చుడదాం
భాషల లక్ష్మణరేఖలు చెరిగిపోతాయి

మాటలే కదా ఒక గీతకు
ఇవతల అవతల
ప్రాణాన్ని
రెండు ముక్కలు చేసింది
ఒకే జాతిని
ఇద్దరు శత్రువులుగా చీల్చింది

రండి
కరచాలనం చేసి
రెండు రెండు నాలుగు చేతుల్లోని
ఇరవై వేళ్ళతో
ఈ రేఖపైన
ఒక గులాబీ విత్తు నాటుదాం
రెండు దేశాల ఆంక్షల్ని జయిద్దాం

Thursday, March 26, 2009

ముఖచిత్రం



పిడికెడు మట్టి ఇస్తాను
ఏ దేశానిదో చెప్పగలవా?

ఓ చిరునవ్వు ముక్కని
నీ ప్రయోగశాల
రసాయన నాళికల్లో మరగబెట్టి
దాన్నో అశ్రుకణంగా మార్చగలవా?

అబద్ధాల గిరిగీతల మధ్య బందీవై
ఒంటరి చెట్టుగా మిగిలిపోయినంత కాలం
నేలపైన హరితస్వప్నం సాకారం కాలేదు

చేతులతో చేతులు కలిపి
కౄత్రిమ స్నేహాలు
చిలకరించినన్ని తరాలు
మనిషికీ, మనిషికీ మధ్య
పరుచుకున్న
సముద్రాలు ఇంకిపోవు

రంగుల తెరమీది స్వార్థ స్వప్నాల నాటిక కోసం
ఎన్ని ముఖాలు మార్చినా, ఎన్ని ఆహార్యాలు రంగరించినా
నేల మీది నీ అడుగులే నీ చరిత్ర

నేల కోసం, నింగి కోసం
నీ జాతి కోసం, నీ నెత్తుటి తీపి కోసం
నీ చుట్టూ నువ్వు నిర్మించుకున్న
సరిహద్దు గోడలకవతల
ఒక మహాప్రపంచపు విశాల హౄదయం
విశ్వ తీరాల ద్వారాలు తెరచి
నిరీక్షిస్తుంది నీ కోసం

విద్వేషపు లావాలా ప్రవహించడం మాని
మరీచికపై కురిసిన మంచు కణంలా
ఎడారి గుండెల ఆర్ద్ర గీతమై
భూమ్యాకాశాల క్షితిజాన్ని కౌగిలించుకో
ప్రపంచ ముఖచిత్రంపై
కొత్త మనిషి రూపురేఖలు రచించుకొ

మనిషిని గెలవడానికి
మందుపాతరలు, తుపాకిగుళ్ళు కాదు
పిడికెడు ప్రేమను పేల్చు
విశ్వమానవ సౌభ్రాతౄత్వం వెల్లివిరుస్తుంది.