Thursday, March 26, 2009

ముఖచిత్రం



పిడికెడు మట్టి ఇస్తాను
ఏ దేశానిదో చెప్పగలవా?

ఓ చిరునవ్వు ముక్కని
నీ ప్రయోగశాల
రసాయన నాళికల్లో మరగబెట్టి
దాన్నో అశ్రుకణంగా మార్చగలవా?

అబద్ధాల గిరిగీతల మధ్య బందీవై
ఒంటరి చెట్టుగా మిగిలిపోయినంత కాలం
నేలపైన హరితస్వప్నం సాకారం కాలేదు

చేతులతో చేతులు కలిపి
కౄత్రిమ స్నేహాలు
చిలకరించినన్ని తరాలు
మనిషికీ, మనిషికీ మధ్య
పరుచుకున్న
సముద్రాలు ఇంకిపోవు

రంగుల తెరమీది స్వార్థ స్వప్నాల నాటిక కోసం
ఎన్ని ముఖాలు మార్చినా, ఎన్ని ఆహార్యాలు రంగరించినా
నేల మీది నీ అడుగులే నీ చరిత్ర

నేల కోసం, నింగి కోసం
నీ జాతి కోసం, నీ నెత్తుటి తీపి కోసం
నీ చుట్టూ నువ్వు నిర్మించుకున్న
సరిహద్దు గోడలకవతల
ఒక మహాప్రపంచపు విశాల హౄదయం
విశ్వ తీరాల ద్వారాలు తెరచి
నిరీక్షిస్తుంది నీ కోసం

విద్వేషపు లావాలా ప్రవహించడం మాని
మరీచికపై కురిసిన మంచు కణంలా
ఎడారి గుండెల ఆర్ద్ర గీతమై
భూమ్యాకాశాల క్షితిజాన్ని కౌగిలించుకో
ప్రపంచ ముఖచిత్రంపై
కొత్త మనిషి రూపురేఖలు రచించుకొ

మనిషిని గెలవడానికి
మందుపాతరలు, తుపాకిగుళ్ళు కాదు
పిడికెడు ప్రేమను పేల్చు
విశ్వమానవ సౌభ్రాతౄత్వం వెల్లివిరుస్తుంది.

1 comment:

jonnavithula said...

మిత్రమా, మీ ముఖచిత్రం చదివాను.

పిదికెడు మట్టి
అది ఏ దేశానికి చెందిందంటే అది
నాదేశానికే చెందిందంటాను

మాకు యోగశాలలేగానీ
ప్రయోగశాలలతో పనిలేదు
మా పరీక్ష నాళికల్లో
మార్కులే తప్ప
మానవీయత లేదు

కాబట్టీ చిరునవ్వుల్ని రాంకుల కుంచాలతో
తిరగేసి కొలుస్తాం
మాకు హరిత స్వప్నాలు రావు

ఎందుకంటే మా అయ్యవార్లు
ఉద్యోగాల్ని కలగనే విద్యలే తప్ప
చెట్ల కలల గురించి చెప్పలేరు
మా సర్టిఫికెట్లే
మీ ఉప్పు సముద్రాలమీద
మేం వేసే వంతెనలు

మా ముఖాల గురించి మీకు తెలీదు
మీరు తెలుసుకోనూలేరు
ఎందుకంటే
మీ బడి వేరు - మా బడి వేరు

మా బడిలో చరిత్రలుండవు
ఫీజులూ రుబ్బురోళ్ళూ
ప్రశ్నా పత్రాలూ
మార్కుల జాబితాలూ
ఇవే మా చరిత్రలూ వర్తమానాలూ
కెరీరిజం తప్ప
మరో భవిష్యత్తు లేదు
ఉండదు
ఉన్నా మాకక్కరలేదు

నింగీ నేలా
నదీ నదాలూ అన్నీ
మా కెరీర్ కోసమే
మీ కెరీర్ కూడా మా కెరీర్ మీదే
ఆధార పడి వుంది
బీ కేర్ ఫుల్
చీర్లూ బీర్లూ కేర్లూ
అన్నీ నిండినవే
మా నాలెడ్జ్ బార్లు

మీ భూమి గరిమనాభిని చూసుకోండి
అది
మేమే మేమే మేమేమేమే
మేకలం కాదు గొర్రెలం కాదు
మీ దేహానికి బొడ్డులం
అండ పిండ బ్రహ్మాండాల గాడిద గుడ్డులం గాడ్ ది గుడ్డులం

మిమ్మల్ని గెలవడానికి
మాకు మందు పాతరలొద్దు
తుపాకీ గుళ్ళొద్దు
ప్రేమలసలొద్దు
మా కెరీరే మాకు ముద్దు
మీ గురించి
ఏకాస్త ఆలోచించినా
మా మొహం మీద గుద్దు
( మీ ముఖ చిత్రానికి నా నఖ చిత్రం అనగా మీ కవితకు మెచ్చుకోలుగా నా గిచ్చుకోలు - మొత్తానికి నాచేత ఇలా తొలి కవిత రాయించినందుకు కృతజ్ఞతలు .
- జొన్నవిత్తుల )