చిన్నారుల చిట్టి చేతుల్లో ఆర్డీఎక్స్ బాంబు లొద్దు
తెల్లని శాంతి పూలు పూయించండి
కాన్వెంట్ బస్తాలు మోసే ఆ ఆంగ్ల బానిసలకి
మాతృ భాషలో స్వాతంత్ర్యం ప్రకటించండి..
చూచిరాత రాసినట్టు అంతస్తుల గోడల్ని పాకడం వద్దు
ఒక్కో అడుగూ వేసే స్థిత ప్రజ్ఞత నడక నడిపించండి..
చట్ట సభల్లో కంకులెసిన అవినీతి తలలకి
సాన పెట్టిన కొడవళ్ళ కొసలతో కొత్త పాఠాలు నేర్పండి..
ప్రేమ ముళ్ళు గుచ్చుతున్న గులాబీల కంటి రక్త ధారల్ని
ఆత్మ విశ్వాసపు రహదారుల వెంట ధైర్యంగా పరుగెత్త నీయండి..
వసంత రుతువులో కాగితం పూల అలంకారాలెందుకు..?
అద్దంలో అందాలు వెతుకుతూ ఆత్మ వంచన లెందుకు..?
ఇంకా ఆలస్యం కాలేదు..
ఇప్పుడైనా పస్త్చాత్తాపాన్ని "సబ్బుబిళ్ళ" చేయండి..
ధర్మాలోచనల "అగ్గిపుల్ల" వెలిగించి మెదడు లోయల్లో
అన్యాయపు చీకట్లను వెంటాడండి
వీధి చివర "కుక్కపిల్ల" లా ఘోషిస్తున్న
ఆత్మ కేకల్ని ఒక్కసారి ఆలకించండి
రేపటి తరానికి మనమేమి చరిత్ర మిగిలిస్తున్నామో
గుండెల మీద చేతులతో పరికించండి..!
పెరుగు.రామకృష్ణ
No comments:
Post a Comment