ప్రముఖ బెంగాలి దిన పత్రిక "ఉపత్యక" ఆహ్వానం మేరకు పశ్చిమ బెంగాల్ లో గల
మిడ్నాపూర్ లో ప్రతి ఏట నిర్వహించే కవితోత్సవం కి నెల్లూరు జిల్లా నుండి నేను ప్రతిమ
ఎంపిక కాబడాము.నేను నెల్లూరు నుండి 05-12-2009 ఉదయం యశ్వంతపూర్ -హౌరా
సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాను.సరిగ్గా 23 గంటలు ప్రయాణం తర్వాత ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగాను .
ప్రముఖ బెంగాలికవి విప్లవ్మాజి నన్ను రిసీవ్ చేసుకునేందుకు స్టేషనుకు వచ్చారు .
ఖరగ్పూర్ నుండి తొమ్మిది కిలో మీటర్ల దూరంలో గల మిడ్నాపూర్ బయలుదేరాము .
ఉదయపు చలిగాలిలో కారులో ప్రయాణిస్తూ కంసావతి నది దాటాక తెల తెల వారుతుండగా
కలకత్తా నగరం కన్నా అతి పురాతనమైన ,చారిత్రాత్మకమైన ఆ పట్టణంలో ప్రవేశించగానే
ఏదో చెప్పలేని పులకింత. భారత స్వాతంత్ర్య ఉద్యమం పురుడు పోసుకుంది ..
ఆ పట్టణంలోనే అని విప్లవ్మాజి చెప్పినపుడు ఒక గగుర్పాటు.. నేరుగా విప్లవ్మాజి వారింటికెళ్లి
ఫ్రెషప్ అయ్యాక వారి శ్రీమతి నందిత భట్టాచార్య అందించిన బ్రెడ్ టోస్ట్ ,వేడి టీ సేవించాను ..
ఇంతలో హర్యానా నుంచి ఆహ్వానితులైన కవి దంపతులు సుశీల్,ఊర్మిళా కౌశిక్ లు అక్కడకి చేరుకున్నారు .ప్రయాణం గురించి కబుర్లయ్యాక మాకు నిర్దేశించిన హోటల్ రిట్జ్ బెంగాల్ లో దిగబెట్టారు.బెంగాలి చిన్న దిన పత్రిక 'ఉపత్యక" ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది.15 ఏండ్లుగా ఆ పత్రిక వస్తున్నట్లు చెప్పారు..
విద్యా సాగర్ స్మృతి మందిర్ - ఈ మందిరం 1939లో రవీంద్రనాథ్ ఠాగోర్ చే ఆవిష్కరింపబడ్డది.
1939 లో విశ్వ కవి రవీంద్రనాథ్ స్వయంగా ప్రారంభించిన "విద్యాసాగర్ స్మృతి మందిర్ " ఈ కవితోత్సవ వేదిక అనివిప్లవ జీ చెప్పినప్పుడు మళ్లీ ఒళ్లు పులకించింది.. సరిగ్గా 10.00 గంటలకు కార్యక్రమం మొదలయింది.అతిధులను ఆహ్వానించారు.నేను రెండవ ఉపన్యాసకుడిగా " మా మహాకవి శ్రీశ్రీ " అనే పరిచయ పత్ర సమర్పణచేశాను..అనంతరం శబ్ద కాలుష్యం గురించి ఒక కవిత తెలుగులో మరియూ అంగ్ల అనువాద కవితవినిపించాను..ప్రముఖ బెంగాలి కవి ఆశిష్ సన్యాల్ (79) శ్రీశ్రీ తో ఆయనకు పరిచయమున్నట్లు చెప్పిఆ జ్ఞాపకాలు నెమరేసుకున్నారు..ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక మా పరిచయాలు ,కవిత వేసి వెలువరించారు..ఆ వేదిక మీద నుండి ఆ రోజు 10 బెంగాలి పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి..ముఖ్యంగా ఆ జిల్లా గ్రామీణ కథల 4 వ సంపుటి నన్ను ఎంతో ఆకర్షించింది..యువ కవులు కవిత్వం 300 కాపీలు ప్రచురిస్తున్నట్టు చెప్పారు.ముద్రణ ఎంతో బాగుంది.
ఎడమ నుండు కుడి వైపు: హర్యానా కవి సుషీల్ కౌసిక్, బెంగాల్ కవి ఆషిష్ సన్యాల్, బెంగాలి కవి విప్లవ్ మాజీ, రామకృష్ణ, ఉపథ్యక సంపాదకుడు తపోష్ మైతీ ఇంకా శ్రీమతి తపోష్ మైతీ
ఆ సాయంత్రం నాలుగు గంటల వరకు కవిసమ్మేళనం జరిగింది...మాకు జ్ఞాపికలుగా
అక్కడ గ్రామీణ మట్టి తో చేసిన యశోదా ,కృష్ణ ఇవ్వడం ఎంతో కొత్తగా అనిపించింది.ఉత్తరీయం అని శాలువమరి ప్రశంసా పత్రం తో సత్కరించారు..ఇక్కడ నుండి మావోఇస్ట్ కల్లోల ప్రాంతంగా వార్తల్లో వినిపించే " లాల్ గఢ్"చాల దగ్గర.. ఈ యుద్ద వాతావరణం వల్ల ఇంకా చాల మంది కవులు హాజరు కాలేక పోయినట్టు చెప్పారు..ఆ సాయంత్రమే నేను 8.20 గంటలకు విప్లవ జి లోకల్ ట్రైన్ మిడ్నపోర్ లో ఎక్కించగా ఖరగ్పూర్ వచ్చి10.20 రాత్రి హౌరా-యశ్వంతపూర్ ఎక్ష్ప్రెస్స్ లో నెల్లూరు తిరుగు ప్రయాణం అయ్యాను..రవీంద్రుని గడ్డపై ఒకసాహిత్య కార్య క్రమం హాజరై ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుకున్నాను..గొప్ప ఆనందం కలిగింది..
1 comment:
రామకృష్ణ గారు నేను మీబ్లాగు మొదటి సారిగా చూస్తున్న,
ఈ టపా చదవడం చాలా సంతోషంగా ఉంది,
మీ అనుభవాలు బాగున్నాయ్, మన మహా కవి శ్రీశ్రీ గారి గురించి అక్కడ మీరు ప్రస్తావించడం బావుంది ...
మీరు దయ చేసి మిడ్నాపూర్ సభలో చదివి వినిపించిన శ్రీశ్రీ పరిచయ పత్రం ఇక్కడ పోస్ట్ చేయగలరు...
మళ్లీ వస్తాను ....
ఒక సారినా బ్లాగ్ వైపు కూడా ఓ సారి తొంగి చూడరూ..
www.tholiadugu.blogspot.com
Post a Comment