Saturday, June 4, 2011

మనిషిని ఎగురేయండి...!



వసంతా గమనం కాదు
చిరునవ్వులు పుష్పించడం కావాలి
రక్త నదీ ధారా ప్రవాహంలో
ఆత్మ చేలాంచెలం శ్వేతకేతనమై
రెపరెపలాడడం కావాలి
మనిషిని రక్త మాంసాల గోదాముగా కాదు
ప్రాణ పల్లవ స్నేహ సౌధంగా చూసే చూపు కావాలి
నిన్నటి మానవ మజిలీలు
నేటి స్మశాన శిధిలాలైతే
నేటి మానవతా బృందావనాలు
రేపటి ఎడారి పర్రలౌతాయి
నిరంకుశ శ్వాసల ప్రభంజనంలో
చెదరి చెక్కలైన స్వప్నాలౌతాయి
అణు బాంబుని సృష్టించడం కంటే ...
ఆకలి మంటలు ఆర్పడం వైజ్ఞానికం..
క్లోనింగ్ ఆవిష్కారాల సంచలనం కాదు
ఆరే దీపాన్ని నిలబెట్టడం గొప్ప...
హిరోషిమా హింసా జ్వాల
నాగసాకీ మృత దేహాల ఖేదం
శ్వాసపై విధించిన నిషేధానికి సంకేతం
తీన్మేన్ స్కెర్లొ నరమేధం ..
లెబనాన్ లో శేవయాగం ..
మానవత్వం పునాదిపై గొడ్డలి వేటే..?
ఏం సాధించాలి మనిషిని వధించి
సమాధుల పైన సామ్రాజ్యమా .
మట్టి దిబ్బల పైన ఆధిపత్యమా../
అస్తిత్వాలు మరచిరండి
శత్రుత్వాలు విడిచి రండి..
మనిషిని క్రీస్తు,బుద్ధుల వారసుల్లా మలచండి
శ్వేతశిఖరంలా నిలబెట్టండి
శాంతికేతనం లా ఎగురేయండి...!

(ప్రపంచ శాంతి ని ఆకాంక్షిస్తూ...)

పెరుగు.రామకృష్ణ

No comments: