బొడ్డు కోసుకుంది ఇక్కడే
అమ్మ నాన్న పెదవులపైన
రెండు గులాబీలు పూయించింది ఇక్కడే
ఇక్కడే రెండు రెళ్ళు నాలుగై
కళ్ళల్లో ఆనంద దీపాలు వెలిగింది
అ ఆ లు నేర్చుకున్నా
వేమన పద్యాలు వల్లెవేసినా
సుమతి శతకం అప్ప చెప్పినా
మెట్టు మెట్టు పాకుతూ
మెదడు కంప్యూటరు లో సీడీ నై
డిగ్రీలు తోడుక్కుందీ ఇక్కడే
విత్తునై మొలకెత్తింది ఇక్కడే
తోటనై, వసంతాల బాటనై
యవ్వనాల ఉన్మేష పాటనై
యువ కెరటమై ఉద్దానించింది ఇక్కడే
స్వాతి చినుకుల చిత్తడిలో
మట్టి వాసన పీల్చుకుంది ఇక్కడే
ఉద్వేగంతో ఉరకలెత్తిన ఉడుకు రక్తం
ప్రేమ ధారగా ప్రవహించింది ఇక్కడే
నా గోరు ముద్దల నేతి ముద్దలు
పండిన పచ్చటి నేల ఇక్కడే...!
పెరుగు రామకృష్ణ
No comments:
Post a Comment