Thursday, June 9, 2011

జ్ఞాపకాలు పూస్తాయి...!


ప్రాణం ఆగిపోయినప్పుడు
జ్ఞాపకాలు పూస్తాయి
తనువు చాలించినప్పుడు
తలపులు తన్నుకొస్తాయి
రంగులు ఆయుధంగా
గోడల్ని కళాత్మకం చేసాడు
ఎందుకో అర్ధంకాని ఆవేశంలో
సముద్రం లాంటి సంస్కృతి పై
ఒక అసహనాన్ని పుక్కిలించాడు
రేఖల్ని ఖడ్గంగా హృదయాల్ని కోసాడు
అయినా సరే...
చందమామ లేని ఆకాశం అందంగా ఉంటుందా?
సృజనకారుడు లేని సమాజమూ అంతే..
మంచి కళాకారుడు
మరణం పాలయ్యాడంటే
మనసు తెగిపడిన జ్ఞాపకమౌతుంది..
దీపవారధి మీద భారంగా నడచి
ఆకాశపు హరివిల్లు మధ్య
అందమైన రంగవల్లి గీసి నివాళి అర్పిస్తుంది
సరిహద్దులు చెరిపేస్తూ
కళను,కళాకారుణ్ణి విశ్వజనీనం చేస్తుంది...

పెరుగు రామకృష్ణ




Monday, June 6, 2011

ఇక్కడే...




బొడ్డు కోసుకుంది ఇక్కడే
అమ్మ నాన్న పెదవులపైన
రెండు గులాబీలు పూయించింది ఇక్కడే
ఇక్కడే రెండు రెళ్ళు నాలుగై
కళ్ళల్లో ఆనంద దీపాలు వెలిగింది
అ ఆ లు నేర్చుకున్నా
వేమన పద్యాలు వల్లెవేసినా
సుమతి శతకం అప్ప చెప్పినా
మెట్టు మెట్టు పాకుతూ
మెదడు కంప్యూటరు లో సీడీ నై
డిగ్రీలు తోడుక్కుందీ ఇక్కడే
విత్తునై మొలకెత్తింది ఇక్కడే
తోటనై, వసంతాల బాటనై
యవ్వనాల ఉన్మేష పాటనై
యువ కెరటమై ఉద్దానించింది ఇక్కడే
స్వాతి చినుకుల చిత్తడిలో
మట్టి వాసన పీల్చుకుంది ఇక్కడే
ఉద్వేగంతో ఉరకలెత్తిన ఉడుకు రక్తం
ప్రేమ ధారగా ప్రవహించింది ఇక్కడే
నా గోరు ముద్దల నేతి ముద్దలు
పండిన పచ్చటి నేల ఇక్కడే...!

పెరుగు రామకృష్ణ

Saturday, June 4, 2011

మనిషిని ఎగురేయండి...!



వసంతా గమనం కాదు
చిరునవ్వులు పుష్పించడం కావాలి
రక్త నదీ ధారా ప్రవాహంలో
ఆత్మ చేలాంచెలం శ్వేతకేతనమై
రెపరెపలాడడం కావాలి
మనిషిని రక్త మాంసాల గోదాముగా కాదు
ప్రాణ పల్లవ స్నేహ సౌధంగా చూసే చూపు కావాలి
నిన్నటి మానవ మజిలీలు
నేటి స్మశాన శిధిలాలైతే
నేటి మానవతా బృందావనాలు
రేపటి ఎడారి పర్రలౌతాయి
నిరంకుశ శ్వాసల ప్రభంజనంలో
చెదరి చెక్కలైన స్వప్నాలౌతాయి
అణు బాంబుని సృష్టించడం కంటే ...
ఆకలి మంటలు ఆర్పడం వైజ్ఞానికం..
క్లోనింగ్ ఆవిష్కారాల సంచలనం కాదు
ఆరే దీపాన్ని నిలబెట్టడం గొప్ప...
హిరోషిమా హింసా జ్వాల
నాగసాకీ మృత దేహాల ఖేదం
శ్వాసపై విధించిన నిషేధానికి సంకేతం
తీన్మేన్ స్కెర్లొ నరమేధం ..
లెబనాన్ లో శేవయాగం ..
మానవత్వం పునాదిపై గొడ్డలి వేటే..?
ఏం సాధించాలి మనిషిని వధించి
సమాధుల పైన సామ్రాజ్యమా .
మట్టి దిబ్బల పైన ఆధిపత్యమా../
అస్తిత్వాలు మరచిరండి
శత్రుత్వాలు విడిచి రండి..
మనిషిని క్రీస్తు,బుద్ధుల వారసుల్లా మలచండి
శ్వేతశిఖరంలా నిలబెట్టండి
శాంతికేతనం లా ఎగురేయండి...!

(ప్రపంచ శాంతి ని ఆకాంక్షిస్తూ...)

పెరుగు.రామకృష్ణ