Thursday, December 31, 2009

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు రొట్టెల పండుగDarga - famous for Rottela Panduga (Bread festival of Nellore)

నెల్లూరు నగరం లోని "బారా షహీద్ దర్గా" మొహరం పండుగ వస్తే చాలు దేశ,విదేశాలనుండి భక్తులని ఆకర్షిస్తూ రొట్టెలు పంచుకొని, మొక్కులు చెల్లించుకొనే "ఒకే ఒక విశేషపండుగ" జరుపుకొనే ఏకైక ప్రదేశం గానమోదయి చరిత్రలో నిలచిపోయింది. భారతదేశ సంస్కృతి, సమైక్యత,మతసామరస్యానికి,ప్రతీకగా రొట్టెల పండుగనిలుస్తుంది.ప్రతి సంవత్సరం దర్గా దర్శించి మొక్కులు చెల్లించే వారిలో ముస్లిములతో పాటు,ఇతర మతాల వారుముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రొట్టెల పండుగ సుమారు ఎనభై సంవత్సరాలుగా ఇక్కడజరుగుతున్నట్టు ఆధారా లు వున్నాయి. 1905 లో దర్గా ప్రస్తావన నెల్లూరు శాసనాలు రెండవ సంపుటం లోకనిపిస్తుంది.

బారా షహీద్ దర్గా కు సంబంధించి ఒక కధ వుంది. యుద్దంలో పన్నెండు మంది వీరులు నెల్లూరు కు దగ్గరలో గలగండవరం వద్ద అమరులయ్యారు.తలలు లేని వీరుల దేహాలు గుర్రాలపై స్వారి చేస్తూ ఇప్పుడు సమాదులున్న చోటపడిపోయాయి.భక్తులు ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ఆర్కాటునవాబు ఒక సారి దారిన వెళ్తూ దర్గా వద్ద ఏదో మొక్కు మొక్కుకున్నారట. ఆయన కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కధనం. సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల లో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.

మత సామరస్యానికి ప్రతీకగా ఎంతో వైభవంగా, అశేష భక్త జన సందోహం మధ్య జరిగే రొట్టెల పండుగ ఏడాది 28 డిసెంబర్మొదలై 29 గంధ మహోత్సవం,30 రొట్టెల మార్పిడి,31 జియారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ రొట్టెల పండుగ లో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు,అనుమసముద్రం పేటల లోనిపేరొందిన దర్గాల ను కూడా సందర్శిస్తారు.

పవిత్రంగా, పరిశుభ్రంగా ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు(రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,..సంప్రదాయ రొట్టెలుతో మొదలైన పండుగలో ఇప్పుడు వీసా రొట్టెలు, ప్రజా ప్రతినిధులు వదిలే అభివృద్ధి రొట్టెలు అదనపుఆకర్షణలవుతున్నాయి. ఏడాది ప్రత్యేకించి రొట్టెల పండుగ జనవరి లో జరిగి మళ్ళీ రెండవసారి డిసెంబర్ లో వచ్చింది.బారా షహీద్ అమరవీరుల సమాధుల ద్వారం

లక్ష్యల సంఖ్య లో ప్రజలు దేశం లోని వివిధ ప్రదేశాల నుంచిమరియు గల్ఫ్ లాంటి విదేశాల నుంచి వచ్చి మొక్కులుచెల్లించడం
పెరిగి పోతున్నందున జిల్లా యంత్రాంగం ఇప్పుడు ప్రత్యేక దృష్టిపెట్టి రవాణ సౌకర్యం,అన్నదానాలు, మంచినీరు,మరుగుదొడ్లు,
లాంటి వసతులన్నీ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంది. ఇదిఎంతయినా అభినందనీయం..! దర్గా మైదానంలో ఎక్కడ చెత్తలేకుండా చూసే భాద్యతను నెల్లూరు నగర పాలక సంస్థచేపట్టింది. కార్యక్రమంలో నగర ఎమెల్యే ఎం.శ్రీధరకృష్ణా రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమెల్యే ఆనం.వివేకానంద రెడ్డి జిల్లా కలెక్టర్రాంగోపాల్,ఎస్పీ మల్లారెడ్డి , మేయర్ భానుశ్రీ తదితరులునిమగ్నమై వున్నారు..!

పండుగ గురించి తెలియని వారు వచ్చే సంవత్సరం మొహరం రోజుకి నెల్లూరు వచ్చేయండి..!
రొట్టెల పండుగలో పాల్గొనండి..!!

Tuesday, December 8, 2009

మిడ్నాపూర్ జాతీయ కవితోత్సవం-2009

ప్రముఖ బెంగాలి దిన పత్రిక "ఉపత్యక" ఆహ్వానం మేరకు పశ్చిమ బెంగాల్ లో గల
మిడ్నాపూర్ లో ప్రతి ఏట నిర్వహించే కవితోత్సవం కి నెల్లూరు జిల్లా నుండి నేను ప్రతిమ
ఎంపిక కాబడాము.నేను నెల్లూరు నుండి 05-12-2009 ఉదయం యశ్వంతపూర్ -హౌరా
సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాను.సరిగ్గా 23 గంటలు ప్రయాణం తర్వాత ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగాను .
ప్రముఖ బెంగాలికవి విప్లవ్మాజి నన్ను రిసీవ్ చేసుకునేందుకు స్టేషనుకు వచ్చారు .
ఖరగ్పూర్ నుండి తొమ్మిది కిలో మీటర్ల దూరంలో గల మిడ్నాపూర్ బయలుదేరాము .
ఉదయపు చలిగాలిలో కారులో ప్రయాణిస్తూ కంసావతి నది దాటాక తెల తెల వారుతుండగా
కలకత్తా నగరం కన్నా అతి పురాతనమైన ,చారిత్రాత్మకమైన ఆ పట్టణంలో ప్రవేశించగానే
ఏదో చెప్పలేని పులకింత. భారత స్వాతంత్ర్య ఉద్యమం పురుడు పోసుకుంది ..
ఆ పట్టణంలోనే అని విప్లవ్మాజి చెప్పినపుడు ఒక గగుర్పాటు.. నేరుగా విప్లవ్మాజి వారింటికెళ్లి
ఫ్రెషప్ అయ్యాక వారి శ్రీమతి నందిత భట్టాచార్య అందించిన బ్రెడ్ టోస్ట్ ,వేడి టీ సేవించాను ..
ఇంతలో హర్యానా నుంచి ఆహ్వానితులైన కవి దంపతులు సుశీల్,ఊర్మిళా కౌశిక్ లు అక్కడకి చేరుకున్నారు .ప్రయాణం గురించి కబుర్లయ్యాక మాకు నిర్దేశించిన హోటల్ రిట్జ్ బెంగాల్ లో దిగబెట్టారు.బెంగాలి చిన్న దిన పత్రిక 'ఉపత్యక" ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది.15 ఏండ్లుగా ఆ పత్రిక వస్తున్నట్లు చెప్పారు..


విద్యా సాగర్ స్మృతి మందిర్ - ఈ మందిరం 1939లో రవీంద్రనాథ్ ఠాగోర్ చే ఆవిష్కరింపబడ్డది.

1939 లో విశ్వ కవి రవీంద్రనాథ్ స్వయంగా ప్రారంభించిన "విద్యాసాగర్ స్మృతి మందిర్ " ఈ కవితోత్సవ వేదిక అనివిప్లవ జీ చెప్పినప్పుడు మళ్లీ ఒళ్లు పులకించింది.. సరిగ్గా 10.00 గంటలకు కార్యక్రమం మొదలయింది.అతిధులను ఆహ్వానించారు.నేను రెండవ ఉపన్యాసకుడిగా " మా మహాకవి శ్రీశ్రీ " అనే పరిచయ పత్ర సమర్పణచేశాను..అనంతరం శబ్ద కాలుష్యం గురించి ఒక కవిత తెలుగులో మరియూ అంగ్ల అనువాద కవితవినిపించాను..ప్రముఖ బెంగాలి కవి ఆశిష్ సన్యాల్ (79) శ్రీశ్రీ తో ఆయనకు పరిచయమున్నట్లు చెప్పిఆ జ్ఞాపకాలు నెమరేసుకున్నారు..ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక మా పరిచయాలు ,కవిత వేసి వెలువరించారు..ఆ వేదిక మీద నుండి ఆ రోజు 10 బెంగాలి పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి..ముఖ్యంగా ఆ జిల్లా గ్రామీణ కథల 4 వ సంపుటి నన్ను ఎంతో ఆకర్షించింది..యువ కవులు కవిత్వం 300 కాపీలు ప్రచురిస్తున్నట్టు చెప్పారు.ముద్రణ ఎంతో బాగుంది.ఎడమ నుండు కుడి వైపు: హర్యానా కవి సుషీల్ కౌసిక్, బెంగాల్ కవి ఆషిష్ సన్యాల్, బెంగాలి కవి విప్లవ్ మాజీ, రామకృష్ణ, ఉపథ్యక సంపాదకుడు తపోష్ మైతీ ఇంకా శ్రీమతి తపోష్ మైతీ

ఆ సాయంత్రం నాలుగు గంటల వరకు కవిసమ్మేళనం జరిగింది...మాకు జ్ఞాపికలుగా
అక్కడ గ్రామీణ మట్టి తో చేసిన యశోదా ,కృష్ణ ఇవ్వడం ఎంతో కొత్తగా అనిపించింది.ఉత్తరీయం అని శాలువమరి ప్రశంసా పత్రం తో సత్కరించారు..ఇక్కడ నుండి మావోఇస్ట్ కల్లోల ప్రాంతంగా వార్తల్లో వినిపించే " లాల్ గఢ్"చాల దగ్గర.. ఈ యుద్ద వాతావరణం వల్ల ఇంకా చాల మంది కవులు హాజరు కాలేక పోయినట్టు చెప్పారు..ఆ సాయంత్రమే నేను 8.20 గంటలకు విప్లవ జి లోకల్ ట్రైన్ మిడ్నపోర్ లో ఎక్కించగా ఖరగ్పూర్ వచ్చి10.20 రాత్రి హౌరా-యశ్వంతపూర్ ఎక్ష్ప్రెస్స్ లో నెల్లూరు తిరుగు ప్రయాణం అయ్యాను..రవీంద్రుని గడ్డపై ఒకసాహిత్య కార్య క్రమం హాజరై ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుకున్నాను..గొప్ప ఆనందం కలిగింది..

Wednesday, November 25, 2009

నిఘంటువుజిగిబిగి పద వీధుల్లో
తారాడే బాషా బాటసారికి
దారి చూపి గమ్యం చేర్చే
నమ్మకమయిన మార్గదర్శివి...

పుస్తకాల పురుగు ప్రక్కనే ప్రవహిస్థూ
నిరంతర పద దాహం తీర్చే జీవనది..

రచయిత ఉహాల తోటల్లో
విన్నూత్న భావాల మల్లెలు పూయించే
పడకటింటి తోడు....

కవి చేతిలో పోపుల డబ్బా..

ఓ నిఘంటువా..!
మా అనంతమయిన పద భాండాగారమా..!!
ఒక కొత్త పద అర్ధాన్ని తెలుసుకున్నప్పుడల్లా..
సరి కొత్త ప్రపంచపు జ్ఞాన ద్వారాలు తెరుచు కుంటాయి..

పదాల, పద బందాల
పరమార్ధం తెలిపే గురువు కానీ ..
మన తెలుగు వారందరికీ
సర్వోన్నత సందేశాలు పంపే తీపి పంచనీ....

ఓ నిఘంటువా..!
నీవు ఈ ప్రపంచాన్ని ఒకటిగా నిలిపేదానివి..
మాటల బంగారు తీగకు
మానవత్వపు పూసలు గుచ్చినట్లు..
సముద్రపు నిధి లాంటి
నిన్ను ఈదిన ప్రతిసారీ
ఈ గ్రహాన్ని జయించిన విజేత నవుతుంటాను...!!!


ఆంగ్ల మూలం :మైదవోలు సత్యనారాయణ,నెల్లూరు
తెలుగు అనువాదం:పెరుగు రామకృష్ణ,నెల్లూరు

Monday, September 21, 2009

మట్టి పరిమళం

సీమ గడ్డన పుట్టిన
సింహంలాంటి బిడ్డా..
నీ హటాన్మరణంతో
తెలుగు నేల
మట్టి పరిమళం కోల్పోయింది..

భూమి పుత్రుడా...!
పేదలకు అన్ని వరాలిచ్చి
అదనంగా చిరునవ్వు కానుకిచ్చేవాడివి..
నీ నవ్వు లేని చీకటి రాజ్యంలో
ఇక వారికి వెలుగు దివ్వె ఎవరౌతారు..?

నిలువెత్తు తెలుగుజాతిసంతకంలా
మిలమిల మెరిసే నీ హుందా నడక ఏది..?
నీ పదం పుడమిని తాకినంతనే
బీటలువారిన నేల సైతం హరితాన్నద్దుకుంటుంది

నీ ఆప్యాయత పలకరింపు
విన్నవెంటనే వృద్దాప్యం
కడలికేరటంలా ఎగసిపడ్తుంది..
ఫీజుల్లేని చదువువులిచ్చిన యువత గుండె చప్పుడు
సాధికారతతో మహిళల ఆత్మబలం నీవిప్పుడు..

సంక్షేమ రాజ్యంలో
విద్య,వైద్య రంగాల్లో సరికోత్త పువ్వులు వికసింపచేసావ్
జలయజ్ఞంతో అపర భాగీరధడువి
చరిత్రలో నీకంటూ కొన్ని పుటలు మిగుల్చుకెళ్లావ్...
ప్రతి ఇంటి పెద్ద దిక్కు నీవే అయినవేళ..
నీవు లేవని దిక్కులు పిక్కటిల్లేలా గుండెలాగిపోతున్నాయిలా..

చినుకు వచ్చి విత్తనాన్ని మొలిపించినంత సహజంగా..
నువ్వు మా మధ్యకు రావాలి..
హరితాంధ్ర అందాల్ని..
కళకళలాడే ప్రాజెక్టుల్ని..
కళ్ళాపుజల్లిన తెలుగు లోగిళ్లను..
నీ పాదయాత్రతో పునీతం చేయాలి..
ఈ పుణ్యభూమిపై నీ నవ్వు మళ్ళీ మెరవాలి..
ఆ రోజు కోసం ..మా రాజు కోసం..
ఇక్కడ మేమంతా నిలువెల్లా కనులై నిరీక్షిస్తుంటాము...


పెరుగు.రామకృష్ణ. నెల్లూరు.
9849230443

Sunday, August 2, 2009

నా నేస్తం
అనంతమైన సృష్టిలో
అద్భుతమైన స్నేహితురాలు
అమ్మ కాక ఇంకెవరు ??

Wednesday, July 1, 2009

నెమలి గొంతులో కోయిల

స్వరాల మెట్లతో
స్వర్గానికి నిచ్చెన వేసి
భూమి వెన్ను మీద నిటారుగా నిలచి
సంగీత ప్రపంచంలో
ఆకాశమే హద్దని చాటి
పాటకి గజ్జె కట్టిన
నల్లమయూరం అతడు...

గొంతులో కోయిల నుంచుకొని
తన పాటకు తానే
రాగం, తానం,పల్లవై
పదంతో పాదం కలిపిన చెలికాడతడు..

విశ్వ చరిత్ర పుటల్లో
చెరగని సంతకమయి నిలచాడు..


(ఇటీవలే గతించిన ప్రఖ్యాత గాయకుడు మైకేల్ జాక్సన్ కు నివాళి)

Sunday, June 21, 2009

ముంజలు


ఛాయా చిత్రం ఫ్రాప్కి వారి సౌజన్యంతో


వేసవొస్తే
వెంటాడే జ్ఞాపకం
తాతయ్య తినిపించిన
తాటిముంజలు...


కాగితం పడవలో
అక్షరాలు అలా
మా వాకిట్లోకొచ్ఛి
కవిత్వాన్ని మోసుకెళ్ళాయి.


వేసవి తాపం
వోపలేకేమో
పాముల్లాంటి జడల్లో
దాక్కున్నాయి మల్లెలు.


ఆమె గొంతెప్పుడు
పెగలదు
కళ్ళు మాత్రం
భాషిస్తూనే ఉంటాయి..

మాటలోంచి
మాటల్లోకి ప్రయాణం
ఈ చర్చకు
లక్ష్యమే కరువు....

Saturday, March 28, 2009

సరిహద్దురేఖ


ఈ రేఖపైన
రెండు దేశాల
ఆంక్షల్ని జయించుదాం

ఇరు హౄదయాల లయను
ఒకటి చేసే శ్వాసను
సృష్టిద్దాం

రక్త జలపాతాల మధ్య
విద్వేషాగ్ని లావా ప్రవాహాల గుండా
ఓ శాంతి మార్గాన్ని నిర్మిద్దాం

దారి పొడవునా
పంచుకోవలసిన రక్తస్పర్శల్ని
పోగొట్టుకున్న ఆత్మీయతల జాతరలని
అలంకరిద్దాం
చిరునవ్వుల హరివిల్లు ముక్కలతో

పాటకి, మాటకి మధ్య
రాగం తప్పినా
తాళం తప్పినా
నియమ భంగమే కదా

ఎందుకొచ్చిన గొడవ
కళ్ళతో హృదయాలని
ఆవిష్కరించుకొనే
కొత్త భాషకి
శ్రీకారం చుడదాం
భాషల లక్ష్మణరేఖలు చెరిగిపోతాయి

మాటలే కదా ఒక గీతకు
ఇవతల అవతల
ప్రాణాన్ని
రెండు ముక్కలు చేసింది
ఒకే జాతిని
ఇద్దరు శత్రువులుగా చీల్చింది

రండి
కరచాలనం చేసి
రెండు రెండు నాలుగు చేతుల్లోని
ఇరవై వేళ్ళతో
ఈ రేఖపైన
ఒక గులాబీ విత్తు నాటుదాం
రెండు దేశాల ఆంక్షల్ని జయిద్దాం

Thursday, March 26, 2009

ముఖచిత్రంపిడికెడు మట్టి ఇస్తాను
ఏ దేశానిదో చెప్పగలవా?

ఓ చిరునవ్వు ముక్కని
నీ ప్రయోగశాల
రసాయన నాళికల్లో మరగబెట్టి
దాన్నో అశ్రుకణంగా మార్చగలవా?

అబద్ధాల గిరిగీతల మధ్య బందీవై
ఒంటరి చెట్టుగా మిగిలిపోయినంత కాలం
నేలపైన హరితస్వప్నం సాకారం కాలేదు

చేతులతో చేతులు కలిపి
కౄత్రిమ స్నేహాలు
చిలకరించినన్ని తరాలు
మనిషికీ, మనిషికీ మధ్య
పరుచుకున్న
సముద్రాలు ఇంకిపోవు

రంగుల తెరమీది స్వార్థ స్వప్నాల నాటిక కోసం
ఎన్ని ముఖాలు మార్చినా, ఎన్ని ఆహార్యాలు రంగరించినా
నేల మీది నీ అడుగులే నీ చరిత్ర

నేల కోసం, నింగి కోసం
నీ జాతి కోసం, నీ నెత్తుటి తీపి కోసం
నీ చుట్టూ నువ్వు నిర్మించుకున్న
సరిహద్దు గోడలకవతల
ఒక మహాప్రపంచపు విశాల హౄదయం
విశ్వ తీరాల ద్వారాలు తెరచి
నిరీక్షిస్తుంది నీ కోసం

విద్వేషపు లావాలా ప్రవహించడం మాని
మరీచికపై కురిసిన మంచు కణంలా
ఎడారి గుండెల ఆర్ద్ర గీతమై
భూమ్యాకాశాల క్షితిజాన్ని కౌగిలించుకో
ప్రపంచ ముఖచిత్రంపై
కొత్త మనిషి రూపురేఖలు రచించుకొ

మనిషిని గెలవడానికి
మందుపాతరలు, తుపాకిగుళ్ళు కాదు
పిడికెడు ప్రేమను పేల్చు
విశ్వమానవ సౌభ్రాతౄత్వం వెల్లివిరుస్తుంది.