Monday, January 25, 2010

కొత్త మనిషి...!

రక్తం రంగు
చెప్పనక్కరలేదు
నువ్వు మనిషి వాసన వేస్తే చాలు..
నీ స్పర్శ నిరంతర పరిచయాల దొంతర
నులివెచ్చదనమొక్కటే కరువైంది
ఈ నేలకు నిన్ను చిరునామా చేయడం
నీలోని శాంతి సహన పర్వానికి నిదర్శనం
నీ చిరునామా కొరకు నువ్వెతుక్కోవడమంటే
పువ్వు పరిమళాన్ని కోల్పోయిందనే
మట్టివాసన సమసిపోయిందనే
లింగ వివక్షా పరీక్షల్లో నీ ఉనికి నువ్వు కోల్పోయావనే
పావురం కోసం తొడ మాంసాన్ని తూచిన
నీకొండ పిడికెడు గుండెగా మారిందా..?
నీ కాలి ధూళి తాకితే రాతి నాతిగా మారే గుణం కరువైందా..?
వొక్క పిలుపుకి కోటి పాదాలై కదలిన నీ నడక
శాంతి యుద్ధానికి శత సహస్ర ప్రాణాలుగా విచ్చుకున్న ఆత్మ
నీలోని పంచభూతాల్లోని జీవ లక్షణమే కదా..!
జీవ లక్షణానికి మరణం వుండదు,ఋణం తప్ప
బతికుండగానే, అమ్మను కాటికి మోసినప్పుడే
నీ భుజాల నుంచి కుళ్ళిన శవాల కంపు మొదలైంది
నీలో మనిషి మరణించిన చావుకేక వినిపించింది
ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన స్వార్ధ సమిధలు నిరర్ధకం
పిచ్చుక గూట్లో ఇరుక్కొని రాత్రంతా వెలుతురైన
ఒక మిణుగురు కావాలి ,స్తబ్దాటవిలో పాదయాత్ర కోసం
ఆ మిణుగురు తనం ఆరిపోయింది నీలో
కోట్లాది కన్నుల్లో కన్నీటి తడిని తుడిచిన
కరుణకు మొలిచిన ఆ చేయి విరిగిపోయింది నీలో..
వర్షానికి గొడుగుపట్టడం వేరు,.
ఎండకి నీడగా చెట్టు అయి మొలవడం వేరు
రెండు చేతుల్ని వేయిచేసి నిండు మనసుతో
కౌగిలించుకునే అమ్మతనం ఆరిపోయింది నీలో..
విత్తుగా మొలకేత్తే గుణం చచ్చిపోయింది నీలో
నీలో ప్రాణమనే లక్షణం మరణించడానికి ముందే
నేల తల్లి చిరునామా మారిపోవడానికి ముందే
నువ్వు ఫీనిక్స్లా ,అగ్నిస్నానం చేయాలిప్పుడు
కొత్త ఆకాశం అక్కర్లేదు, కొత్త రుతువులు అక్కర్లేదు
వందేమాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలిప్పుడు...!

(This poem bagged First best prize of Rs 4000/- and citation in International poetry contest by koumudi.net web journal in April2007 )

Saturday, January 16, 2010

ఏవి గొప్ప...?
పాత తరం అమ్మ
ఎనభై ఏళ్ళ బామ్మ
పాతికేళ్ళ
మా ఇంజనీర్
బంగారు బొమ్మ తో
పండుగ పిండివంటలు చేస్తూ
"మీకు ఇప్పుడు
పుట్టినరోజు ,పెళ్లిరోజు,
ప్రేమికుల రోజు,తల్లి రోజు,తండ్రి రోజు "..
ఇన్నీ..

ప్రతి క్షణం
ఆత్మీయత,అభిమానం,
అనురాగం,ఐకమత్యం
వెల్లివిరిసిన రోజులు..!
మావి అన్నీ..

Wednesday, January 6, 2010

కొన్ని అనువాద హైకూలు..!


Photo by cbrao taken at Kokkare Bellur, Karnataka.

చీకటిని పారద్రోల్తూ
ఓ పక్షి పాట..
సూర్యోదయం..!

చావు కళ
వేయి నోళ్ళు తెరుచుకున్నట్లు
ఎండిన మాగాణి..!

మంచు ముత్యం..
కత్తి మొన లాంటి
గడ్డి పోచ చివర..!

పరిమళం తీపి
పంచుతునే వుంది..
చెట్టు ముక్కలైనా..!

అర్థ రాత్రి
ఆకాశం కింది రెండో అంతస్తే
వారికిల్లయింది..!

ఆంగ్ల మూలం:షారోన్ ఆబ్రెల్,విస్కన్సిస్
అనుసృజన: పెరుగు రామకృష్ణ,నెల్లూరు

Saturday, January 2, 2010

పూలతోట కాలుతోంది..నిరసనల పోరు
నిప్పురవ్వల జోరు..
నిన్నటిదాకా
పరిమళాలు పంచిన

పూలతోట కాలుతుంది..
రేపటికి మిగిలేది
అస్తిత్వాల అస్థికలే కాబోలు..
కుల వివక్ష..
లింగ వివక్ష..
జాతి వివక్ష...
వివక్షలేప్పుడూ
విభజన రేఖ లే గీస్తుంటాయిగా ...!
ఐక్య రాగం పాడే వీణను
ఏక రాగానికే పరిమితం చేద్దామా..?
సంకుచితత్వాల్ని
సముద్రలోతుల్లోకి విసిరేద్దాం ..!
విశాలత్వాన్ని
వినీలాకాశంలా కాపాడుకొందాం..!
"విశ్వమానవ సౌబ్రాత్రుత్వం" ..
"వసుదైక కుటుంబం"
పద అర్ధాలు పదిలపరచుకొందాం ..!!