Monday, September 21, 2009

మట్టి పరిమళం

సీమ గడ్డన పుట్టిన
సింహంలాంటి బిడ్డా..
నీ హటాన్మరణంతో
తెలుగు నేల
మట్టి పరిమళం కోల్పోయింది..

భూమి పుత్రుడా...!
పేదలకు అన్ని వరాలిచ్చి
అదనంగా చిరునవ్వు కానుకిచ్చేవాడివి..
నీ నవ్వు లేని చీకటి రాజ్యంలో
ఇక వారికి వెలుగు దివ్వె ఎవరౌతారు..?

నిలువెత్తు తెలుగుజాతిసంతకంలా
మిలమిల మెరిసే నీ హుందా నడక ఏది..?
నీ పదం పుడమిని తాకినంతనే
బీటలువారిన నేల సైతం హరితాన్నద్దుకుంటుంది

నీ ఆప్యాయత పలకరింపు
విన్నవెంటనే వృద్దాప్యం
కడలికేరటంలా ఎగసిపడ్తుంది..
ఫీజుల్లేని చదువువులిచ్చిన యువత గుండె చప్పుడు
సాధికారతతో మహిళల ఆత్మబలం నీవిప్పుడు..

సంక్షేమ రాజ్యంలో
విద్య,వైద్య రంగాల్లో సరికోత్త పువ్వులు వికసింపచేసావ్
జలయజ్ఞంతో అపర భాగీరధడువి
చరిత్రలో నీకంటూ కొన్ని పుటలు మిగుల్చుకెళ్లావ్...
ప్రతి ఇంటి పెద్ద దిక్కు నీవే అయినవేళ..
నీవు లేవని దిక్కులు పిక్కటిల్లేలా గుండెలాగిపోతున్నాయిలా..

చినుకు వచ్చి విత్తనాన్ని మొలిపించినంత సహజంగా..
నువ్వు మా మధ్యకు రావాలి..
హరితాంధ్ర అందాల్ని..
కళకళలాడే ప్రాజెక్టుల్ని..
కళ్ళాపుజల్లిన తెలుగు లోగిళ్లను..
నీ పాదయాత్రతో పునీతం చేయాలి..
ఈ పుణ్యభూమిపై నీ నవ్వు మళ్ళీ మెరవాలి..
ఆ రోజు కోసం ..మా రాజు కోసం..
ఇక్కడ మేమంతా నిలువెల్లా కనులై నిరీక్షిస్తుంటాము...


పెరుగు.రామకృష్ణ. నెల్లూరు.
9849230443

4 comments:

cbrao said...

దివంగత రాజశేఖర రెడ్డి పంచకట్టు, నిలువెత్తు తెలుగుతనాన్ని మనముందర ఉంచుతుంది. తరగని చిరునవ్వు ఆయన ఆయుధం. మీ కవిత వారికి సరైన నివాళి.

Anonymous said...

అవునండీ చాలా చక్కగా చెప్పారు.
తను ఆ ప్రభువు దగ్గరనుండి, తనలాగే గుళ్లూ గోపురాలు తిరుగుతూ మరీ, రోజు రోజుకూ ప్రభు భక్తులు అవుతున్న మన ఆంధ్రులను, ముఖ్యంగా అలా అవటాని ముందు ఉండి అన్నిరకాలుగా సహాయ పడుతున్న తన అల్లుడను,
ముందుగానే తన ఆరు అడుగుల సమాధికోసం కబ్జాలు చేసి మరీ ఏర్పాటుచేసుకొన్న 600 ఎకరాల ఎస్టేట్ ను, లక్షకోట్లు కుమ్మరించినా ఏ మాత్రం ముందుకు కదలకుండా చింతలు మాత్రమే మిగులుస్తున్న పులిచింతల లాంటి ప్రాజెక్ట్ లను,
కందిపప్పు అన్నా, సన్న బియ్యమన్నా కొనలేక, దుడ్డుబియ్యం, కందిపప్పు లేని పప్పుచారులతో రోజు రోజుకు ఆరోగ్యవంతులవుతున్న తెలుగు బిడ్డలను,
రోజు రోజుకు తన ఖాతాలో పోతున్న ఊరి (తన భందుమిత్రులు/తన ఊరి వాళ్లు/తన నియోజకవర్గం కాని వాళ్లు) జనాలు, ఆ సంఖ్య పెరగటానికి ఇతోధికం గా సహాయపడుతున్న తండ్రి ఉండి కూడా పుట్టిన కలియుగపు దేముని బిడ్డ అయిన జగన్ ఏసయ్య సాక్షి పత్రికను,
ఇలా గుండెలు బాదేసుకొంటూ, ముక్కులు చీరేసుకొంటూ కపితలు వ్రాస్తున్న మన లాంటి అభిమానులను పైనుండి చూస్తూ ఇలానే నవ్వుతూ ఉండాలి. నవ్వవద్దు అనుకొన్నా నవ్వు వస్తూనే ఉంటుంది ఆయనకు అయినా , ఇంకెవరికయినా

'Padmarpita' said...

మీ కవితతో వారికి నివాళి చక్కగా చెప్పారు.

సుభద్ర said...

చాలా బాగా రాసారు.నిజ౦గా మళ్ళి అలా౦టి నేత రాడు. anonymous gaaru okalaa meeru correct amdi.