Monday, September 21, 2009

మట్టి పరిమళం





సీమ గడ్డన పుట్టిన
సింహంలాంటి బిడ్డా..
నీ హటాన్మరణంతో
తెలుగు నేల
మట్టి పరిమళం కోల్పోయింది..

భూమి పుత్రుడా...!
పేదలకు అన్ని వరాలిచ్చి
అదనంగా చిరునవ్వు కానుకిచ్చేవాడివి..
నీ నవ్వు లేని చీకటి రాజ్యంలో
ఇక వారికి వెలుగు దివ్వె ఎవరౌతారు..?

నిలువెత్తు తెలుగుజాతిసంతకంలా
మిలమిల మెరిసే నీ హుందా నడక ఏది..?
నీ పదం పుడమిని తాకినంతనే
బీటలువారిన నేల సైతం హరితాన్నద్దుకుంటుంది

నీ ఆప్యాయత పలకరింపు
విన్నవెంటనే వృద్దాప్యం
కడలికేరటంలా ఎగసిపడ్తుంది..
ఫీజుల్లేని చదువువులిచ్చిన యువత గుండె చప్పుడు
సాధికారతతో మహిళల ఆత్మబలం నీవిప్పుడు..

సంక్షేమ రాజ్యంలో
విద్య,వైద్య రంగాల్లో సరికోత్త పువ్వులు వికసింపచేసావ్
జలయజ్ఞంతో అపర భాగీరధడువి
చరిత్రలో నీకంటూ కొన్ని పుటలు మిగుల్చుకెళ్లావ్...
ప్రతి ఇంటి పెద్ద దిక్కు నీవే అయినవేళ..
నీవు లేవని దిక్కులు పిక్కటిల్లేలా గుండెలాగిపోతున్నాయిలా..

చినుకు వచ్చి విత్తనాన్ని మొలిపించినంత సహజంగా..
నువ్వు మా మధ్యకు రావాలి..
హరితాంధ్ర అందాల్ని..
కళకళలాడే ప్రాజెక్టుల్ని..
కళ్ళాపుజల్లిన తెలుగు లోగిళ్లను..
నీ పాదయాత్రతో పునీతం చేయాలి..
ఈ పుణ్యభూమిపై నీ నవ్వు మళ్ళీ మెరవాలి..
ఆ రోజు కోసం ..మా రాజు కోసం..
ఇక్కడ మేమంతా నిలువెల్లా కనులై నిరీక్షిస్తుంటాము...


పెరుగు.రామకృష్ణ. నెల్లూరు.
9849230443