Tuesday, April 19, 2011

భారత రత్నం...!



ఏ జన్మ లోనో తీరని పరుగుల తృష్ణని
కొనసాగిస్తూనే వున్నాడు..
ఆత్మవిశ్వాసాన్ని గుండెకు గుచ్చుకున్న వీరుడిలా
బుడి బుడి నడకల ప్రాయంలోనే
పరుగుల జీవిత లక్ష్యాన్ని ఎంచుకున్నాడు
ఆత్మన్యూనతతో ఇంకి పోతున్న యువతను మేల్కొపేలా
ఆత్మస్థైర్యాన్ని బంతులు బంతులుగా గాల్లోకి సంధిస్తాడు
ఆట స్థలం అతనికి దేవాలయం
నిత్య క్రీడా యజ్ఞం లో విజయ ఫలం కోసం పరితపిస్తాడు
అలుపెరుగని ప్రయాణం లో
అందలాలే ఎక్కాడు
మరెవ్వరూ అందుకోలేని
శిఖరాలే చేరాడు..
పరుగుల రికార్డులతో
ప్రపంచ గోడల మీద భారతావని గొప్పతనాన్ని
ఇంద్రధనుస్సు రంగుల్లో రచిస్తూనే వున్నాడు
ప్రపంచ జైత్ర యాత్రలో ప్రతి మజిలీ లో
ఒక మైలురాయి నాటాడు..
ఇల్లంతా జ్ఞాపికల తోరణం చేయడమే గాక
క్రికెట్ ప్రపంచంలోని ప్రతి గుండె
అతన్ని పదిలపరిచిన జ్ఞాపికయ్యింది..
అతను చరిత్రను చదవలేదు
క్రీడా చరిత్రను తిరగ రాయడమే నేర్చుకున్నాడు
జీవితంలో నిత్య గెలుపును సాధించాడు
విశ్వ వేదిక మీద ఎన్నో దృశ్యాలు
అతడు ఎవరూ మరువలేని సుందర దృశ్యమయ్యాడు ..
విశ్వ నిఘంటువులో ఎన్నో పదాలు
అందరి నాల్కల మీద అలవోకగా నర్తించే పదమయ్యాడు
సచిన్ టెండూల్కర్..
అతడు
జగతి జనం మొత్తం మెచ్చిన జాతి ముత్యం
భావి తరాలకు కానుకవ్వాల్సిన "భారత రత్నం"...!

పెరుగు .రామకృష్ణ

2 comments:

Unknown said...

బాగుందండీ మీ కవిత. నిజంగా టెండుల్కర్ భారత రత్నమే కాదు. భారత్ మెచ్చే రత్నం కూడా...

ramperugu said...

dhanyavaadaalandee..!